ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు

  • విశాఖలో నిరాడంబరంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 5
  • తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం
  • మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ యువన్
  • శ్రీనాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో గెలుపు
  • బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి సత్తా చాటిన కాకినాడ జట్టు
విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్ ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి వేడుకలు లేకుండా టోర్నమెంట్‌ను నిరాడంబరంగా మొదలుపెట్టారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ జట్టు, సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ యువన్ సిక్సర్లతో విరుచుకుపడి అజేయ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్ అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్, వికెట్ కీపర్ లక్షజ్ రెడ్డి కూడా దూకుడుగా ఆడి తమ వంతు పరుగులు జోడించారు.

అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ లయన్స్ జట్టు, కాకినాడ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కాకినాడ కింగ్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో ఆంజనేయులు 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన యువన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కాకినాడ కింగ్స్.. ఈ సీజన్‌లో తమ ప్రయాణాన్ని ఘన విజయంతో ఆరంభించింది.

Andhra Premier League
APL 2026 opening match
Kakinada Kings vs Vizag Lions
Visakhapatnam ACA VDCA Stadium
Ganta Srinivasa Rao
Andhra Cricket Association

More Telugu News